Hyderabad: భారీగా తగ్గిపోయిన కరోనా కేసులు... హైదరాబాద్ లో మరో 35 కంటైన్ మెంట్ జోన్ల ఎత్తివేత!
- కుదుటపడుతున్న పాతబస్తీ
- ప్రజలకు ఆంక్షల నుంచి మినహాయింపు
- లాక్ డౌన్ పాటించాల్సిందేనని స్పష్టీకరణ
గడచిన ఐదు రోజుల వ్యవధిలో తెలంగాణలో కొత్త కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో గత 14 రోజులుగా కరోనా పాజిటివ్ లు కనిపించని ప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన కంటైన్ మెంట్ జోన్ల తొలగింపు సాగుతోంది. నాలుగు రోజుల క్రితం 45 జోన్లను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు, తాజాగా, మరో 35 ప్రాంతాలను సాధారణ పరిస్థితికి తెచ్చారు. ఇందులో సగం పాతబస్తీలోనే ఉండటం గమనార్హం.
ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 129 కంటైమ్ మెంట్ జోన్లను కొనసాగిస్తున్నామని స్పష్టం చేసిన అధికారులు, కేసులు నమోదవని జోన్లను తొలగిస్తున్నామని, ప్రజలకు ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుందని, అయితే, వారంతా లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ హైదరాబాద్ పరిధిలో 694 కరోనా కేసులు నమోదుకాగా, 138 మంది చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు చేరారు. మిగతా వారంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 90 శాతం మంది రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఇక కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం నాడు 12 మంది ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి, ఆరుగురు ఫీవర్ ఆసుపత్రికి రాగా, వారి నమూనాలను సేకరించిన వైద్యులు పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.