Chardham: పదడుగుల ఎత్తున మంచు కూరుకుని ఉన్నా, కేదార్ నాథ్ కు చేరుకున్న ఐదుగురు భక్తులు!
![Chardham Yatra Started amid Heavy Snow and Lockdown](https://imgd.ap7am.com/thumbnail/tn-688d5d3e4444.jpg)
- రేపు తెరచుకోనున్న గంగోత్రి, యమునోత్రి
- చార్ థామ్ యాత్రలో భాగంగా జరిగిన పంచముఖి డోలీ యాత్ర
- భక్తులు రాకున్నా పూజలు జరుగుతాయన్న సత్పాల్ మహారాజ్
భారీ ఎత్తున పేరుకుని పోయివున్న మంచు,లాక్ డౌన్ ఆ భక్తుల మనోభీష్టం ముందు ఓడిపోయాయి. ఆరు నెలల పాటు మంచులో కప్పబడివున్న కేదార్ నాథ్ ఆలయాన్ని బుధవారం నాడు తిరిగి తెరవాల్సి వుండగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే పంచముఖి డోలీ యాత్రను దేవాలయానికి చెందిన ఐదుగురు భక్తులు నిర్వహించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రకటించిన లాక్ డౌన్ తో పలువురు యాత్రికులు ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.
ప్రతి సంవత్సరమూ చార్ ధామ్ యాత్ర ప్రారంభానికి ముందు కుమావో బెటాలియన్ ఆధ్వర్యంలో 1000 మంది యాత్రికులు పంచముఖి డోలీ యాత్రను నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కేవలం ఐదుగురు భక్తులు పంచముఖి విగ్రహాన్ని కేదార్ నాథ్ కు తరలించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-1812c5285518fdc22578ebdc2f72cbc149407e7a.jpg)
హిందూ మత సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా, నాలుగు దేవాలయాలనూ తెరచి వుంచాలని నిర్ణయించినట్టు సత్పాల్ మహారాజ్ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. భక్తులు రాలేకపోయినప్పటికీ, ఆలయాల్లో పూజలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.