Saudi Arebia: సౌదీ మరో కీలక నిర్ణయం... మైనర్లకు మరణదండన కూడా రద్దు!
- ఇటీవలే కొరడా దెబ్బల శిక్ష రద్దు
- పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న వారి కేసుల సమీక్ష
- ఉత్తర్వులు జారీ చేసిన సౌదీ రాజు సల్మాన్
ఇటీవలే కొరడా దెబ్బల శిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన నేరాల్లో మైనర్లకు అమలు అవుతున్న మరణశిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజు ఉత్తర్వులు జారీ చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక జైల్లో మగ్గుతున్న వారిలో పదేళ్ల శిక్షను పూర్తి చేసుకున్న వారి కేసులను సమీక్షించి, వారి శిక్షా కాలాన్ని తగ్గించడం కానీ విడుదల చేయడం కానీ చేయాలని రాజు ఆదేశించారు.
కాగా, మైనర్లకు మరణదండన రద్దు కావడంతో, షియా వర్గానికి చెందిన ఆరుగురు మృత్యువును తప్పించుకున్నారు. ఇస్లామిక్ చట్టాలకు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే రాజు ఇటీవలి నిర్ణయాల వెనుక ఆయన కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. సౌదీలో ఇంకా సంస్కరణ వాదులపైనా, మహిళా హక్కుల కార్యకర్తలపైనా అణచివేత ధోరణి కొనసాగుతూనే ఉంది. దీనిపైనా రాజు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.