Umar Akmal: పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మన్ పై మూడేళ్ల నిషేధం
- ఉమర్ అక్మల్ పై పీసీబీ క్రమశిక్షణ చర్యలు
- పీఎస్ఎల్ సందర్భంగా ఉమర్ ను కలిసిన కొందరు వ్యక్తులు
- బోర్డుకు సమాచారం అందించకుండా దాచాడని ఆరోపణలు
పాకిస్థాన్ క్రికెట్ లో అవినీతి ప్రక్షాళన ఇంకా జరగాల్సి ఉందన్న విషయాన్ని తాజా ఘటన చాటుతోంది. పాక్ స్టార్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. ఇటీవల జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టీ20 పోటీల సందర్భంగా కొందరు వ్యక్తులు తనను సంప్రదించిన విషయాన్ని ఉమర్ అక్మల్ బోర్డు అధికారులకు చెప్పకుండా దాచాడన్న కారణంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
అన్ని రకాల క్రికెట్ ఆడకుండా ఉమర్ పై నిషేధం విధిస్తున్నామని బోర్డు పేర్కొంది. ఉమర్ పై ఆరోపణలు వచ్చిన సమయంలోనే పీఎస్ఎల్ లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు నుంచి తప్పించింది.
ఉమర్ అక్మల్ పై నిషేధం పట్ల మాజీ ఆటగాడు రమీజ్ రజా స్పందించాడు. మూర్ఖుల జాబితాలో ఉమర్ అక్మల్ కూడా చేరాడని, ప్రతిభను నిజంగా వృథా చేసుకున్నాడని విమర్శించారు. ఫిక్సింగ్ నిరోధానికి చట్టం ఉండాలని రమీజ్ రజా అభిలషించారు. కెరీర్ తొలిటెస్టులోనే సెంచరీ సాధించి ఎన్నో ఆశలు కలిగించిన ఉమర్ అక్మల్, ఆపై అనేక మంచి ఇన్నింగ్స్ ఆడినా, మాటతీరుతో వివాదాల్లో చిక్కుకున్నాడు. బోర్డు అధికారులతో గొడవలు కూడా అతడి కెరీర్ ను మసకబార్చాయి. తాజాగా పీసీబీ తీసుకున్న క్రమశిక్షణ చర్యల ఫలితంగా ఉమర్ అక్మల్ కెరీర్ ముగిసినట్టేనని తెలుస్తోంది.