Corona Virus: కారణాలు ఏవైనా.. కరోనా విషయంలో భారత్ సురక్షితమేనంటున్న నిపుణులు!
- కొత్త కేసులు, మరణాల విషయంలో సంతృప్తి
- అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ వ్యాప్తి
- రోగ నిరోధక శక్తి, ఎండ వేడిమి, బీసీజీ టీకాలే కారణమంటున్న నిపుణులు
- దక్షిణాసియాలో అతి తక్కువ ప్రభావం చూపుతున్న కరోనా
కరోనా మరణాల రేటు యూకేలో 13.4 శాతం, ఇటలీలో 13.3 శాతం, ఫ్రాన్స్ లో 13. 1 శాతం, స్పెయిన్ లో 10. 4 శాతం, అమెరికాలో 5.4 శాతం, ఇండియాలో 3.1 శాతం.
కిలోమీటర్ పరిధిలో ఇండియాలో 453 మంది నివసిస్తూ ఉంటే, యూఎస్ లో 36 మంది, స్పెయిన్ లో 96 మంది, ఇటలీలో 206 మంది ఉంటారు. ఇక ప్రపంచ జనాభాలోని 23 శాతం దక్షిణాసియాలోని ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ లో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యతో పరిశీలిస్తే, ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య ఆందోళన కరమేమీ కాదు.
ఇండియానే గమనిస్తే, టెస్టుల సంఖ్య తక్కువేనని భావించినా, నమోదైన కేసుల్లో మరణాల రేటును గమనిస్తే మాత్రం, దేశాన్ని ఏదో శక్తి కరోనా నుంచి రక్షిస్తోందనే చెప్పాలి. అది ఎండ వాతావరణం కావచ్చు, ఇక్కడ చిన్నప్పటి నుంచే వేసే టీకాలు కావచ్చు, ప్రజల్లోని రోగ నిరోధక శక్తి కావచ్చు, యువ జనాభా అధికంగా ఉండటం కావచ్చు. కారణం ఏదైనా కరోనా విషయంలో ఇప్పటివరకూ ఇండియా సురక్షితంగానే ఉంది.
ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో 60 ఏళ్ల వయసు దాటిన వారు 16 శాతం వరకూ ఉండగా, దక్షిణాసియాలో కేవలం 5 నుంచి 8 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఇక 70 ఏళ్లు దాటిన వారు కేవలం 2 శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను గమనిస్తే, 60 సంవత్సరాలు దాటిన వారిలోనే మృతుల సంఖ్య 85 నుంచి 90 శాతం వరకూ ఉంది. ఈ కారణంచేతనే యువరక్తం అధికంగా కనిపించే దక్షిణాసియాలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇక, మరో ముఖ్యమైన విశ్లేషణ ఏంటంటే, బీసీజీ టీకాలు. అభివృద్ధి చెందిన దేశాలు ఈ టీకాను ఎప్పుడో నిలిపివేయగా, ఇండియాలో దాదాపు పుట్టిన ప్రతి చిన్నారికీ ఈ టీకాను ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అధ్యయనం ప్రకారం, బీసీజీ టీకాలు వేయని దేశాలతో పోలిస్తే, వేస్తున్న దేశాల్లో వైరస్ నియంత్రణ సులువని వెల్లడైంది. ఇటలీలో ఈ టీకాలను వేయకపోవడం వల్లే మరణాల రేటు అధికంగా ఉందని కూడా అధ్యయనం అభిప్రాయపడింది.
ప్రపంచ జనాభాలో 23 శాతం వాటాను కలిగున్న దక్షిణాసియాలో, కరోనా బారిన పడిన వారి సంఖ్యతో చూస్తే మాత్రం కేవలం 1.3 శాతమే వ్యాధికి గురయ్యారు. మృతుల సంఖ్య కూడా ఆందోళన చెందాల్సినంతగా కనిపించడం లేదు. కేసుల సంఖ్య 25 వేలను దాటినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, చాలా తక్కువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో 130 కోట్ల జనాభా ఉన్నఇండియాలో కరోనా చూపించే ప్రభావం స్వల్పమేనని, పెద్దగా ఆందోళన అక్కర్లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.