Corona Virus: చైనా నుంచి టెస్టింగ్ కిట్లు తెచ్చి, అధిక ధరలకు అమ్మకం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టోకరా వేసిన సంస్థలు!
- రూ. 245కు దిగుమతి చేసుకున్న మ్యాట్రిక్స్
- పంపిణీదారుల ద్వారా రూ. 600 వరకూ ధర
- డీలర్ల మధ్య వివాదంతో కేసు ఢిల్లీ హైకోర్టుకు
- ఒక్కో టెస్టింగ్ కిట్ రూ. 400 మించరాదని ఆదేశం
చైనా నుంచి కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ ను ఒక్కోదాన్ని రూ. 245కు కొనుగోలు చేసిన మ్యాట్రిక్స్ సంస్థ, వాటి ధరను రూ. 600కు పెంచేసి, భారత ప్రభుత్వానికి, పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు టోకరా ఇచ్చింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో ధరను వసూలు చేయడంతో ఈ వివాదం బయపడింది. మ్యాట్రిక్స్ నుంచి టెస్టింగ్ కిట్లను పొందిన డీలర్ సంస్థ రియల్ మెటాబాలిక్స్, ఆర్ ఫార్మాస్యుటికల్స్ సంస్థలు ఈ నిర్వాకానికి పాల్పడి, కేంద్రాన్ని మోసం చేశాయి.
మ్యాట్రిక్స్ నుంచి టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన మరో డీలర్ షాన్ బయోటెక్, తమిళనాడు ప్రభుత్వానికి వీటిని అమ్మడంతో వివాదం మొదలైంది. తమతో ఒప్పందం చేసుకున్న మ్యాట్రిక్స్, నిబంధనలకు విరుద్ధంగా షాన్ బయోటెక్ కు టెస్టింగ్ కిట్లను విక్రయించిందని రియల్ మెటాబాలిక్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
ఇక, ఈ కేసులో వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు, వివాదంతో మంచే జరిగిందని, క్లిష్ట సమయంలో ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష తగ్గించుకోవాలని, జీఎస్టీతో కలిపి ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ. 400కు మించరాదని ఆదేశించింది. అగ్రిమెంట్ వివాదాన్ని పక్కనబెట్టి, ప్రతి పంపిణీదారూ కేసును చర్చించి పరిష్కరించుకుని, ప్రజలకు మేలు చేయాలని సూచించింది.
కాగా, చైనాకు చెందిన వాండ్ ఫో సంస్థ తయారు చేసిన ఈ కిట్లను భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరపై వీటిని కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏ కిట్ కు అయినా గరిష్ఠంగా రూ. 400 ధర మించరాదని హైకోర్టు ఆదేశించింది. టెస్టింగ్ కిట్లను అధిక ధరకు విక్రయించిన విషయమై ఐసీఎంఆర్ ఇంకా స్పందించలేదు.