Vijayawada: బోర్ కొడుతోందని పేకాట ఆడి... విజయవాడలో 24 మందికి కరోనాను ఎక్కించిన ట్రక్ డ్రైవర్!
- డ్రైవర్ల ప్రవర్తన కారణంగా 40 కొత్త కేసులు
- సామాజిక దూరం పాటించని ప్రజలు
- నిబంధనలను పాటించాలన్న కలెక్టర్ ఇంతియాజ్
అసలే లాక్ డౌన్, పనీ పాటా లేదు. ఊరికనే కూర్చుని, కూర్చుని బోర్ కొడుతోంది. ఏం చేయాలో పాలుపోని ఓ ట్రక్ డ్రైవర్, చుట్టుపక్కల ఉన్న వారిని పేకాట ఆడేందుకు పిలిచాడు. వారితో కలిసి పేకాట ఆడాడు. తనలో కరోనా ఉందని తెలియకుండానే అతను చేసిన ఈ పని అతని ద్వారా మరో 24 మందికి వైరస్ ను అంటించింది. ఈ ఘటన విజయవాడ నగరంలో జరుగగా, కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ వివరాలను మీడియాకు తెలిపారు.
నిబంధనల కారణంగా గమ్యానికి చేరలేకపోయిన ట్రక్ డ్రైవర్ పేకాట ఆడి 24 మందికి వైరస్ ను అంటించగా, మరో ట్రక్ డ్రైవర్ 15 మందితో కలిసి పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని వారందరికీ వైరస్ వ్యాప్తి అయ్యేలా చేశాడు. ఈ రెండు ఘటనల కారణంగానే, గడచిన రెండు రోజుల్లో నగరంలో 40 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని ఇంతియాజ్ వెల్లడించారు. కృష్ణలంక ప్రాంతంలోని సదరు ట్రక్ డ్రైవర్ పేకాట ఆడాడని, కార్మిక నగర్ ప్రాంతంలో మరో ట్రక్ డ్రైవర్, కనిపించిన వారందరితోనూ కబుర్లు చెప్పాడని వ్యాఖ్యానించారు.
భౌతిక దూరాన్ని పాటించడంలో వీరందరూ విఫలమైన కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, విజయవాడ ప్రాంతం, ఏపీలోనే పెద్ద హాట్ స్పాట్ గా అవతరించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 10 శాతం... అంటే సుమారు 100 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఈ పరిస్థితి మారాలంటే, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా దూరదూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.