Keerthy Suresh: కీర్తి సురేశ్ కి మరో మహానటి బయోపిక్‌ లో ఆఫర్?

Keerthy Suresh to act in Vijaya Nirmala biopic
  • తెరకెక్కనున్న విజయనిర్మల బయోపిక్
  • నటించాలని కీర్తి సురేశ్ ను కోరుతున్న నరేశ్
  • మరో బయోపిక్ చేయనని ఇప్పటికే ప్రకటించిన కీర్తి
దక్షిణాదిలో అప్పటికే కొన్ని సినిమాలు చేసినప్పటికీ, 'మహానటి' చిత్రంతోనే కీర్తి సురేశ్ మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈ సినిమాతో ఆమె పేరు ప్రఖ్యాతులు ఎంతగానో పెరిగాయి. జాతీయ అవార్డులు సైతం ఆమె సొంతమయ్యాయి. తాజాగా కీర్తి గురించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆమెకు మరో బయోపిక్ లో నటించే అవకాశం వచ్చిందనేదే ఆ వార్త. ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ అర్ధాంగి, దివంగత విజయనిర్మల బయోపిక్ లో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చిందట.

తన తల్లి బయోపిక్ లో నటించాలని కీర్తి సురేశ్ ను సీనియర్ నటుడు నరేశ్ కోరుతున్నారట. తెలుగు సినీ పరిశ్రమలో విజయనిర్మలది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. హీరోయిన్, దర్శకురాలు, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమె బయోపిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని... ఆమె పాత్రకు కీర్తి అయితేనే పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారట. అయితే, 'మహానటి' తర్వాత మరో బయోపిక్ చేయనని కీర్తి సురేశ్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Keerthy Suresh
Vijaya Nirmala
Biopic
Tollywood

More Telugu News