Lockdown: లాక్‌డౌన్ కొనసాగితే.. మే నెలాఖరుకి నాలుగు కోట్ల మంది మొబైల్ ఫోన్లు మాయం!: 'ఐసియా' అంచనా
- లాక్‌డౌన్ కారణంగా అందుబాటులో లేని విడిభాగాలు
- కొత్త మొబైళ్ల విక్రయాలపై ఆంక్షలు
- లోపాలు, బ్రేక్‌డౌన్ల కారణంగా నిరుపయోగంగా సెల్‌ఫోన్లు
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే మే నెలాఖరు నాటికి దేశంలోని 4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నాయి. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) ఈ విషయాన్ని వెల్లడించింది. మొబైల్ ఫోన్లు, విడిభాగాల విక్రయాలపై లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగితే జరిగేది ఇదేనని అంచనా వేసింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేసింది. అలాగే, హ్యాండ్‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌డౌన్ల వల్ల మరికొన్ని నిరుపయోగంగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, నెలకు ఇంచుమించు రూ.2.5 కోట్ల మొబైళ్లు కొత్తగా అమ్ముడవుతుంటాయని ఐసియా పేర్కొంది. ఇందులో యాపిల్, ఫాక్స్‌కాన్, షియోమీ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్నింటికి అనుమతి నిచ్చిన ప్రభుత్వం.. అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లను కూడా చేర్చాలంటూ ఇప్పటికే ప్రధాని మోదీని అభ్యర్థించినట్టు ఐసియా చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు.