Lakshmi Parvati: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసిన లేఖ ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు?: లక్ష్మీపార్వతి
- ఆ వివరాలను ల్యాప్ టాప్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?
- ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందే
- ఈ వ్యవహారం నారా లోకేశ్ ఆధ్వర్యంలోనే జరిగింది
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ అంశం మరోమారు ప్రస్తావనకు వచ్చింది. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి దీనిపై మాట్లాడుతూ, ఈ లేఖను తాను రాయలేదని నిమ్మగడ్డ మొదట్లో ఓ జాతీయ ఛానెల్ లో చెప్పారని గుర్తుచేశారు.
ఈ లేఖ విషయమై దర్యాప్తు చేయాలని పోలీసులను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరిన తర్వాత ఆ లేఖ తానే రాశానని ఆయన చెప్పారని, రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందేనని ఆరోపించిన ఆమె, ఈ వ్యవహారం అంతా నారా లోకేశ్ ఆధ్వర్యంలోనే జరిగిందని మరో ఆరోపణ చేశారు.
నాడు రమేశ్ కుమార్ తన కార్యాలయం నుంచి ఈ లేఖను రాస్తే ఆ వివరాలను ల్యాప్ టాప్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన లేకుండా చేశారని సీఐడి అధికారుల ముందు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబమూర్తి అంగీకరించారని చెప్పారు. ఈ లేఖకు సంబంధించిన అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో సమాధానం చెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.