Rajahmundry: రాజమహేంద్రవరం రెడ్ జోన్ లో రోడ్డెక్కిన జనాలు... పోలీసులతో గొడవ!
- పాలు, నిత్యావసరాలు పంపిణీ చేయలేదని రోడ్డెక్కిన ప్రజలు
- జైల్లో పెట్టినట్టు బాధిస్తున్నారంటూ మండిపాటు
- నిత్యావసర వస్తువులను అందించిన మున్సిపల్ అధికారులు
లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని అధికారులు ఎంతగా చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వాటిని ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. చిన్న పిల్లలకు పట్టడానికి మూడు రోజుల నుంచి పాలు లేవంటూ ఆజాద్ చౌక్ లో స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు.
ఆజాద్ చౌక్ ను రెడ్ జోన్ గా ప్రకటించి... అన్ని దారులను అప్పటికే అధికారులు మూసేశారు. అయితే, పాలతో పాటు నిత్యావసర సరుకులను తమకు పంపిణీ చేయడం లేదంటూ పోలీసులతో స్థానికులు గొడవకు దిగారు. జైల్లో పెట్టినట్టు తమను బాధిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికులకు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఘర్షణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసు బృందాలు మోహరించాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన ఆజాద్ చౌక్ చేరుకుని... వారికి పాలు, నిత్యావసర వస్తువులను అందించారు.