Somireddy Chandra Mohan Reddy: మర్కజ్ మత పెద్దలకు ఓ చట్టం.. మీ ఎమ్మెల్యేలకు మరో చట్టమా?: జగన్ కు సోమిరెడ్డి ప్రశ్న
- వైసీపీ నేతలు వందలు, వేల మందితో పలు కార్యక్రమాలు చేస్తున్నారు
- అడ్డొస్తే ఎస్పీని, కలెక్టర్‌ను తిడుతున్నారు
- ఎమ్మెల్యేలను ఎందుకు నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నారు జగన్?
- ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయట్లేదు
లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఆయన తను మాట్లాడిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
'వైసీపీ నేతలు వందలు, వేల మందితో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అడ్డొస్తే ఎస్పీని, కలెక్టర్‌ను ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. దీంతో పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారు.
ఎమ్మెల్యేలు పోలీసులను బెదిరిస్తున్నారు. మీ ఎమ్మెల్యేలను ఎందుకు నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నారు జగన్? మర్కజ్ సభ చీఫ్‌పై కేసులు పెట్టారు. ఆ సభ జరిగినప్పుడు ఇంకా లాక్‌డౌన్ కూడా ప్రారంభం కాలేదు అయినప్పటికీ కేసులు పెట్టారు కదా? మరి లాక్‌డౌన్ సమయంలో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టట్లేదు?' అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
'ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కో చట్టం అమలు చేస్తారా ఏంటీ? ఏం చేస్తారో చేసుకోండి అంటూ మీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?' అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 'మర్కజ్ మత పెద్దలకు ఓ చట్టం..మీ ఎమ్మెల్యేలకు మరో చట్టమా జగన్? అని ఆయన నిలదీశారు.