Narendra Modi: ఈ పోర్టల్‌ వల్ల రుణాలు తీసుకోవడం ఇక సులభతరం: వీడియో కాన్ఫరెన్స్‌లో సర్పంచులతో ప్రధాని

modi video conference with sarpanchs

  • ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్ ప్రారంభం
  • గ్రామాల్లో సమస్యలు గుర్తించవచ్చన్న మోదీ
  • కరోనా వైరస్‌ విజృంభణ ఎన్నో సవాళ్లను విసిరింది
  • మనపైనే మనం ఆధారపడి జీవించాలి  

పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్ ప్రారంభించారు. వీటి ద్వారా ఎన్నో సేవలు పొందవచ్చని తెలిపారు. దీని వల్ల బ్యాంకు రుణాలు తీసుకోవడం చాలా సులభమని చెప్పారు. దేశంలో సర్పంచ్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు.

ఈ పోర్టల్‌ వల్ల గ్రామాల్లో సమస్యలు గుర్తించి, పరిష్కరించడం సులభమని మోదీ తెలిపారు. దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతున్నాయని వివరించారు.

'కరోనా వైరస్‌ విజృంభణ ఎన్నో సవాళ్లను విసిరింది. జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల నుంచి మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు దుర్భరంగా ఉన్న సమయంలో మనం ఎలా వ్యవహరిస్తామన్న విషయాన్ని కరోనా విపత్కర పరిస్థితులు మనకు గుర్తు చేశాయి' అని మోదీ చెప్పారు.

'మనపైనే మనం ఆధారపడి జీవించాలని, ఇతరులపై ఆధారపడొద్దన్న విషయాన్ని కరోనా సమస్య స్పష్టం చేసింది. ఇలా కరోనా వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. వాటిని మనం నేర్చుకుంటున్నాం. మనం వెళ్తోన్న దారిలో మనకు ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. కరోనా విపత్కర సమయంలో ఆత్మనిబ్బరంతో ఉండాలి' అని మోదీ తెలిపారు. గ్రామాల్లో కరోనా విజృంభించకుండా సర్పంచ్‌లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
 
'కరోనా విపత్కర సమయంలో గ్రామాలు తమ సంప్రదాయాలను, సంస్కృతిని చాటిచెబుతూ స్వయం ఉపాధి అంటే ఏంటో నిరూపిస్తున్నాయి. నగరాల కంటే గ్రామాలే ఈ కరోనా విపత్కర సమయాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాయి. నగరాల్లో సమర్థవంతంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజల నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
 
'ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనుసరిస్తోన్న విధానాలు, ఆలోచనలు నగరాల్లో కనపడట్లేవు. నగరాల్లోనే చదువుకున్న వారు అధికంగా ఉంటారు. అయినప్పటికీ గ్రామాల్లోని ప్రజలు అత్యుత్తమంగా ఆలోచిస్తూ, వ్యవహరిస్తూ పరిస్థితులను చాలా చక్కగా ఎదుర్కొంటున్నారు. స్వయంగా కొన్ని పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు' అని ప్రధాని మోదీ సర్పంచ్‌లకు తెలిపారు.
 
గ్రామాలకు కావాల్సిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, గ్రామాలే మన దేశానికి వెన్నెముక అని మోదీ తెలిపారు. గ్రామాల్లో మరిన్ని కార్యక్రమాలు  చేపట్టడానికి సర్పంచ్‌లు ప్రణాళికలు వేసుకోవాలని, కొవిడ్‌-19 పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మార్గదర్శకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News