Zomato: ఆరోగ్య సేతు యాప్ ఉండాల్సిందే... డౌన్ లోడ్ ను తప్పనిసరి చేసిన జొమాటో
- దేశంలో కరోనా వ్యాప్తి
- ఫుడ్ డెలివరీ సంస్థలపై రాష్ట్రాల అసంతృప్తి
- తన భాగస్వాములకు ఆరోగ్యసేతు యాప్ పై స్పష్టతనిచ్చిన జొమాటో
ఫుడ్ డెలివరీ సంస్థల కారణంగా కరోనా వ్యాప్తి జరుగుతోందంటూ అనేక రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ భాగస్వాములు ఇకపై ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో స్పష్టం చేసింది.
తమతో భాగస్వామ్యం కలిగివున్న ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు అందరూ ఆరోగ్య సేతు యాప్ ను కలిగి ఉండాలని, విధిగా వాడాలని, ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఎవరైనా కరోనా సోకిన వ్యక్తి తమ భాగస్వాముల వద్దకు వస్తే ఆరోగ్య సేతు యాప్ హెచ్చరిస్తుందని, తద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.