Corona Virus: కొవిడ్-19 టీకా తయారీలో యూకే ముందడుగు... నేడే తొలి డోస్ ప్రయోగం!
- కరోనా టీకా కోసం శ్రమిస్తున్న 150కి పైగా ప్రాజెక్టులు
- హ్యుమన్ ట్రయల్స్ దశలోకి ప్రవేశించిన 5 సంస్థలు
- నేడు ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో తొలి డోస్ ను ఇవ్వనున్న శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ (కొవిడ్-19) ను అడ్డుకునే వాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండగా, ఈ విషయంలో యూకే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే జర్మనీ, చైనా, ఆస్ట్రేలియా, యూఎస్ తదితర దేశాల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ మొదలుకాగా, యూకే కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇక ఈ వాక్సిన్ విజయవంతం అయ్యే అవకాశాలు 80 శాతం వరకూ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
కాగా, కరోనా టీకాను కనిపెట్టేందుకు ప్రపంచంలో 150కి పైగా ప్రాజెక్టులు పని చేస్తున్నాయి. వీటిల్లో ఇప్పటివరకూ 5 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాయి. నేడు యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంపిక చేసిన వారిపై తొలి డోస్ కరోనా టీకాను ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్ లో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న 510 మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. ఈ వాక్సిన్ విజయవంతం అయితే, సెప్టెంబర్ నాటికి మిలియన్ డోస్ లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు.
నిన్న బుధవారం నాడు జర్మనీ రెగ్యులేటరీ బాడీ పీఎఫ్ఐ దేశంలో తొలి హ్యూమన్ ట్రయల్స్ కు అనుమతి ఇవ్వగా, యూఎస్ దిగ్గజ ఔషధ సంస్థ పిఫిజర్ తో కలిసి జర్మనీకి చెందిన బినోటెక్ తయారు చేసిన వాక్సిన్ ను పరిశీలించనున్నారు. పరీక్షల్లో వాక్సిన్ సక్సెస్ సాధిస్తే, సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.
ఇక తొలిదశలో 18-55 సంవత్సరాల మధ్య వయసున్న 200 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లను ఈ టీకాల కోసం ఎంపిక చేశామని బినోటెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ పేర్కొన్నారు. రెండో దశలో ఆరోగ్యపరంగా హై రిస్క్ వున్న వ్యక్తులకు కూడా టీకాలు వేస్తామని చెప్పారు. మరో వారం రోజుల్లో హ్యూమన్ ట్రయల్స్ ను తాము ప్రారంభిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.