COVID-19: లాక్‌డౌన్ పొడిగింపు వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు: ఫిచ్ సొల్యూషన్స్
- కేసుల ఉద్ధృతి తగ్గే అవకాశం లేదు
- ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది
- ఇది అత్యంత క్లిష్ట సమయమే
దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కేంద్రం వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పొడిగింపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అంతర్జాతీయ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. ఈ నిర్ణయం వల్ల కేసుల ఉద్ధృతి తగ్గకపోగా ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతం వరకు ఉండే అవకాశం ఉందని గతంలో అంచనా వేసిన ఫిచ్.. తాజాగా దీనిని 1.8 శాతానికి తగ్గించింది.
ప్రస్తుతం పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయని పేర్కొంది. ప్రైవేటు వ్యయాలు, పెట్టుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దేశంలో మూడు వారాల సమయంలోనే కేసులు వందల నుంచి వేలల్లోకి చేరుకున్నాయని, మార్చి చివరి నాటికి 700గా ఉన్న కేసులు ఇప్పుడు 20 వేలు దాటిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని, దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే దీనిని అత్యంత క్లిష్ట సమయంగానే చెప్పొచ్చని వివరించింది.