Mahesh Bhagawat: రోహింగ్యా ముస్లింలెవరికీ కరోనా రాలేదు: సీపీ మహేశ్ భగవత్
- రాచకొండ పరిధిలో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
- ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన రోహింగ్యాలను గుర్తించాం
- మే 7 వరకు అందరూ లాక్ డౌన్ పాటించాల్సిందే
తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక భాగం హైదరాబాదులోనే నమోదవుతున్నాయి. దీంతో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరిలో ఒకరు మరణించారని... ఆరుగురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించామని... వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిందని చెప్పారు. అత్యవసర ప్రయాణాలకు అనుమతించే పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు. మే 7వ తేదీ వరకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు.