Celina Jaitly: లాక్ డౌన్ లో ఈ విధంగా చేయండి: సెలీనా జైట్లీ సలహాలు

Celina Jaitly tips for lockdown period
  • పిల్లల బాధ్యతలను భార్యాభర్తలిద్దరూ చూసుకోవాలి
  • ఇంట్లో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకోవాలి
  • ఫిట్ నెస్ పై దృష్టి సారించాలి 
లాక్ డౌన్ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న విషయంపై సినీ నటి సెలీనా జైట్లీ పలు సూచనలు చేశారు. తాను ఏం చేస్తున్నానో... అవే విషయాలను అభిమానులతో పంచుకుంటున్నానని చెప్పారు. ఒక వీడియో ద్వారా సలహాలను పంచుకున్నారు. ప్రస్తుతం తాను ఆస్ట్రియాలో తన భర్త, ముగ్గురు పిల్లలతో కలసి ఉంటున్నానని చెప్పారు.

ప్రపంచం మొత్తాన్ని కరోనా అతలాకుతలం చేస్తోందని... ఒక్కసారిగా యావత్ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని సెలీనా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు సూచించే సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విన్నవించారు. అందరూ ఇంటిపట్టునే ఉండాలని... రోజుకు 10 నుంచి 15 సార్లు చేతులను కడుక్కోవాలని సూచించారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారి కష్టాలు ఎలాగుంటాయో తనకు బాగా తెలుసని... ఈ సమయంలో పిల్లలను తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకోవాలని చెప్పారు. ఇద్దరూ కలిసి పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలని... బాధ్యతలను ఇద్దరూ తీసుకోవాలని తెలిపారు.  

లాక్ డౌన్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలని సెలీనా సూచించారు. ఫిట్ నెస్ పై దృష్టి సారించడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఇంట్లో పెండింగ్ లో ఉన్న పనులను ఇప్పుడు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పారు. పాజిటివ్ మైండ్ తో ఉండాలని... బోర్ అనిపిస్తే ఫోన్ చేసి స్నేహితులతో మాట్లాడాలని సూచించారు. సెలీనా జైట్లీ బాలీవుడ్ తో పాటు ఒక తెలుగు, ఒక కన్నడ సినిమాలో కూడా నటించారు.
Celina Jaitly
Bollywood
Lockdown

More Telugu News