Corona virus: తమ ఉద్యోగులను ఆఫీసులకి పిలిచే క్రమంలో.. ప్రణాళికలు వేసుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థలు!

Coronavirus lockdown  IT companies to continue work from home for next few weeks

  • మొదటి దశలో 5 శాతం ఉద్యోగులను రమ్మంటున్న ఇన్ఫోసిస్
  • ఆ తర్వాత నెమ్మదిగా సంఖ్య పెంపు
  • తొందర పడబోమంటోన్న ఐటీ సంస్థలు
  • ఆఫీసుల్లో ఉద్యోగుల రక్షణకు చర్యలు  

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోవడం, చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర వంటి సంస్థలు తమ ఉద్యోగులను మరి కొన్ని వారాల పాటు ఇంటి నుంచి పనిచేయాలని చెబుతున్నాయి. తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

తమ రాష్ట్రాల్లోని ఐటీ సంస్థలను మూసే ఉంచాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తెలిపాయి. తమ ప్రణాళికలను అమలు పర్చుతున్నామని, నెమ్మదిగా వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ నుంచి కార్యాలయాలకు ఉద్యోగులను రమ్మంటామని, ఇందులో తొందర పడబోమని ఇన్ఫోసిస్‌ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

తమ ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో.. తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని మరో మూడు-నాలుగు వారాల్లో కార్యాలయాలకు రమ్మంటామని వివరించారు. అలాగే, తర్వాత దశలో 15 నుంచి 20 శాతం మందిని నెమ్మదిగా కార్యాలయాలకు రమ్మనే ప్రణాళిక వేసుకున్నామని చెప్పారు. ఉద్యోగుల రక్షణ కోసం తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని, వారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తామని, సామాజిక దూరం పాటించేలా చేస్తామని తెలిపారు.

కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఇప్పటికీ ఎత్తివేయలేదని, తమ సంస్థలోని అత్యధిక మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని టెక్‌ మహీంద్రకు చెందిన ఓ అధికారి తెలిపారు. తమ సంస్థలో పనిచేసే ఐటీ, సెక్యూరిటీ ఉద్యోగులను క్రమంగా విధుల్లోకి రమ్మంటామని చెప్పారు. తమ బిజినెస్‌ను సమర్థవంతంగా కొనసాగించడానికి తమ వద్ద చక్కని ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

 మొదటి దశలో  15-20 శాతం ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు రప్పించాలని ఇప్పటికే నాస్కామ్ సూచనలు చేసింది. కరోనా పరిస్థితులను పరిశీలిస్తూ నెమ్మదిగా ఆ సంఖ్యను పెంచాలని చెప్పింది. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఏప్రిల్‌ 20 నుంచి 50 శాతం మేర కార్యాలయాలకు రప్పించుకోవచ్చని ఇప్పటికే హోం శాఖ మార్గ దర్శకాలు జారీ చేసిందని, అయితే, మొదటి దశలో 15-20 శాతం రప్పించుకోవాలని తాము సూచించామని తెలిపింది.

ఇప్పటికే ఐటీ సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చేస్తున్నారని, ఇందులో సమస్యలు ఏమీ లేవని, తొందర పడి కార్యాలయాలకు వారిని పిలిచి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే అవసరం లేదని సూచించింది. ఐటీ సంబంధిత సంస్థలన్నీ తమ ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News