Germany: కరోనా వెనుక రహస్యాలుంటే దయచేసి చెప్పండి: చైనాను కోరిన జర్మనీ
- కరోనాకు చైనాయే కారణమని విమర్శలు
- పారదర్శకంగా ఉండాలని కోరిన ఏంజెలా మెర్కెల్
- పూర్తి సమాచారం ఇస్తే త్వరగా కష్టం నుంచి బయటపడవచ్చు
- చైనాకు సూచించిన జర్మనీ చాన్స్ లర్
ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుక, దాని వ్యాప్తి తదితర అంశాల్లో చైనా మరింత పారదర్శకంగా ఉండాలని, చైనా తన వద్ద ఉన్న సమస్త సమాచారాన్ని ప్రపంచంతో పంచుకోవాలని జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కోరారు. కరోనాపై పూర్తి సమాచారాన్ని అందిస్తే, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాలను సులువుగా అన్వేషించే వీలుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఆపై ఈ వైరస్ ధాటికి ఎన్నో అగ్రరాజ్యాలు విలవిల్లాడాయి. ఇంకా వైరస్ వ్యాప్తి సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో వూహాన్ లోని ఓ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందన్న ఆరోపణలూ వచ్చాయి. చైనాపై విమర్శలు పెరిగాయి కూడా.
ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితికి చైనాయే కారణమని పలు దేశాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా స్పందించిన ఏంజెలా మెర్కెల్, 'వైరస్ పుట్టుక గురించిన రహస్యం చైనా వద్ద ఉంటే పారదర్శకంగా వ్యవహరించి, దాన్ని బయట పెట్టాలి. వారు వెల్లడించే వివరాల ఆధారంగా కరోనాను ఎదుర్కోవడంపై మరింత సమర్థవంతంగా వ్యూహాలు రచించవచ్చు. కరోనా గురించి మరింత సమాచారం ఇవ్వండి' అని విన్నవించారు.
కాగా, కరోనా విషయంలో తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ వ్యాఖ్యానించారు. వూహాన్ లో వైరస్ గుర్తించిన రోజు నుంచి అన్ని విషయాలను పారదర్శకంగా వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. తమ దేశంపై దావా వేయాలనడం అర్థం లేని విషయమని, గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదని ఆయన అన్నారు.