Ayushman Bharat: ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ కార్యాలయం మూసివేత... ఉద్యోగికి కరోనా పాజిటివ్
- ఉద్యోగిని ఆసుపత్రికి తరలించిన అధికారులు
- ఇతరుల పరిస్థితిపైనా సందేహాలు
- భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
ఢిల్లీలోని 'ఆయుష్మాన్ భారత్' ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యాలయాన్ని మూసివేశారు. ఓ ఉద్యోగికి కరోనా సోకడమే అందుకు కారణం. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. కన్నాట్ ప్లేస్ లోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయం ఉన్న భవనం మొత్తాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ఆ ఉద్యోగితో సన్నిహితంగా మెలిగే ఇతరుల ఆరోగ్యంపైనా సందేహాలు అలముకున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు ప్రైవేటు ల్యాబ్ ల్లోనూ, నిర్దేశిత ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారన్న సంగతి తెలిసిందే. మరోపక్క అటు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.