Swathi: నెల రోజుల పాటు రాజంపేటలో చిక్కుకుపోయిన గజ్వేల్ విద్యార్థిని... హరీశ్ రావు చొరవతో ఇంటికి!
- అజ్మీర్ భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని
- సెలవుల్లో రాజంపేటలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లిన స్వాతి
- లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే ఉండిపోయిన వైనం
వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో దాదాపు నెల రోజుల నుంచి చిక్కుకుని పోయిన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ యువతి స్వాతి, ఎట్టకేలకు ఇల్లు చేరింది. లాక్ డౌన్ కారణంగా రాజంపేటలోని స్నేహితురాలి ఇంట్లో ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చొరవతో స్వాతితో పాటు, వైఎస్ఆర్ కడప జిల్లాలో చిక్కుకుపోయిన మరో 20 మంది తెలంగాణ విద్యార్థులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, గజ్వేల్ కు చెందిన ఆశా వర్కర్ అమృత పెద్ద కుమార్తె స్వాతి రాజస్థాన్ లోని అజ్మీర్ లో భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. మార్చి నెలలో సెలవులకు ఇంటికి వచ్చిన స్వాతి, రాజంపేటలోని స్నేహితురాలి వద్ద కొన్నాళ్లు వుండే నిమిత్తం అక్కడికి వెళ్లింది.
అక్కడ ఉండగానే లాక్ డౌన్ కారణంగా తన కళాశాలకు సెలవులు ఇచ్చినట్టు స్నేహితుల ద్వారా తెలిసి, ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటుండగా, రవాణా సదుపాయాలు కూడా రద్దు కావడంతో నెల రోజుల పాటు రాజంపేటలోనే స్నేహితురాలి ఇంట్లో ఉండిపోయింది.
బిడ్డ క్షేమంపై ఆందోళన చెందిన అమృత, పట్టణ టీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయాన్ని మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన హరీశ్ రావు, వైఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి, స్వాతిని గజ్వేల్ పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆమెతో పాటు జిల్లాలో చిక్కుకున్న మరో 20 మంది కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయగా, నిన్న రాత్రి స్వాతి గజ్వేల్ చేరుకుంది.