Europe: కరోనా అప్ డేట్: లక్ష మరణాలతో యూరప్ కకావికలం
- కొవిడ్-19తో అల్లాడిపోతున్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్
- నిత్యం వేల సంఖ్యలో మరణాలు
- యూరప్ లో 11 లక్షల పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ భూతం యూరప్ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్నివారాలుగా ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలు మరణగీతం ఆలపిస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో మరణాలతో ఈ యూరప్ దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా 11,53,148 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, మరణాల సంఖ్య భీతిగొలిపే రీతిలో 1,01,493కి పెరిగింది. ప్రపంచంలో అత్యధిక మరణాలు ఈ ఖండంలోనే సంభవించాయి.
ఇటలీ 23,227 మరణాలతో యూరప్ లో ప్రథమస్థానంలో ఉంది. స్పెయిన్ లో 20,453, ఫ్రాన్స్ లో 19,323, బ్రిటన్ లో 15,464 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక ప్రపంచం మొత్తమ్మీద కరోనా కేసుల విషయానికొస్తే ఇప్పటివరకు 23,34,130 పాజిటివ్ కేసులను గుర్తించారు. మరణాల సంఖ్య 1,60,685కి చేరింది. అన్ని దేశాల కంటే అత్యధికంగా అమెరికాలో 39,090 మంది చనిపోయారు. అమెరికాలో 7,35,287 మంది కొవిడ్-19 బారినపడ్డారు.