Karnataka: నిండు గర్భిణికి ఎనలేని కష్టం... 7 కిలోమీటర్లు నడిచి డెంటల్ హాస్పిటల్ లో ప్రసవం!

Pregnent Women Walks 7 Kilometers for Delivery in Karnataka

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • రిస్క్ తీసుకుని పురుడు పోసిన డెంటల్ డాక్టర్ రమ్య
  • ప్రసవం అనంతరం మరో ఆసుపత్రికి తల్లి, బిడ్డ

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్న వేళ, నిండు గర్భిణి సుమారు 7 కిలోమీటర్లు నడిచి, సరైన ఆసుపత్రి అందుబాటులో లేక, ఓ దంత వైద్య శాలలో ప్రసవించిన ఘటన కర్ణాటకలో జరిగింది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే ఈ ఘటన జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, ఓ మహిళకు పురుటి నొప్పులు ప్రారంభం కావడంతో, ఆసుపత్రికి వెళ్లాలని భర్తతో కలిసి బయలుదేరింది. సమీపంలోని ఆసుపత్రులు మూసి ఉండటం, ప్రయాణానికి ఒక్క వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో, ఆమె నడుస్తూనే బయలుదేరింది.

చివరకు ఓ డెంటల్ హాస్పిటల్ కనిపించడంతో అందులోకి వెళ్లి, తన పరిస్థితిని గురించి వివరించింది. అక్కడి డాక్టర్ రమ్య, గర్భిణి పరిస్థితిని అర్థం చేసుకుని, పురుడు పోసేందుకు అంగీకరించింది. "బిడ్డ పుట్టిన తరువాత కదలికలు లేకపోయేసరికి మృత శిశువని భావించాను. ఆపై కదలిక తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి, విజయవంతం అయ్యాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ వెంటనే తల్లి, బిడ్డలను మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ కు తరలించాం" అని రమ్య మీడియాకు వివరించారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో ఆసుపత్రి నుంచి తండ్రిని తీసుకుని వెళ్లేందుకు, సొంత ఆటోను పోలీసులు అనుమతించక పోవడంతో, ఓ యువకుడు, తన తండ్రిని భుజాలపై మోస్తూ, కిలోమీటర్ దూరం నడిచిన సంగతి తెలిసిందే. కేరళలో జరిగిన ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందిస్తూ, నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News