Steel Bridge Works: పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను త‌నిఖీచేసిన మంత్రి కేటీఆర్‌

Minister KTR inspects Panjagutta Steel Bridge Works
  • రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు 
  • 50శాతం పూర్తి అయిన ప‌నులు
  • మ‌రో నెల‌రోజుల్లో అందుబాటులోకి రానున్న స్టీల్ బ్రిడ్జి
రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశించారు. ఈ రోజు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, శాస‌న స‌భ్యులు దానం నాగేంద‌ర్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌ల‌తో క‌లిసి నిర్మాణ ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. రోడ్డు విస్త‌ర‌ణ చేసి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గ‌డ్డ‌ర్ల అమ‌ర్చే ప‌నుల‌ను ప‌రిశీలించారు.

లాక్‌డౌన్ వ‌ల‌న క‌లిగిన వెసులుబాటుతో అద‌నంగా కార్మికుల‌ను, నిపుణుల‌ను నియ‌మించి రేయింబ‌వ‌ళ్లు ప‌నులు చేయిస్తున్న కాంట్రాక్ట‌ర్‌ను మంత్రి కె.తార‌క‌రామారావు అభినందించారు. ఇదే స్ఫూర్తితో త‌గిన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటూ, ఆధునిక యంత్రాల‌తో మ‌రో నెల‌రోజుల‌లో ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని కాంట్రాక్ట‌ర్‌ను కోరారు.

స్టీల్ బ్రిడ్జి, రెండు వైపులా రెండు లేన్ల‌ విస్త‌ర‌ణ ప‌నులు 50శాతం పూర్తి అయిన‌ట్లు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్ మ‌న్నె క‌విత‌గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఇంజ‌నీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కాగా, నిత్యం ర‌ద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో ప్ర‌యాణించే వాహ‌న‌దారుల ఇబ్బందులు మ‌రో నెల రోజుల్లో పూర్తిగా తొల‌గిపోనున్నాయి.
Steel Bridge Works
Panjagutta
Hyderabad
KTR
Bonthu Ram Mohan
Danam Nagendar

More Telugu News