Chidambaram: మనసున్న ప్రభుత్వం అయితే ఇలా చేయదు: చిదంబరం
- పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో కేంద్రం విఫలమైందంటూ విమర్శలు
- నగదు బదిలీ, ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీకి డిమాండ్
- మోదీ, నిర్మలా విఫలమయ్యారంటూ వ్యాఖ్యలు
లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పేదవాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శించారు. రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ అమలు చేయడంతో పేదలు ఉపాధి కోల్పోయారని, ఆకలి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో అత్యధికశాతం ప్రజలు నగదు అయిపోవడంతో ఉచితంగా అందించే ఆహారం కోసం క్యూలలో దీనంగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా కేంద్రం పేదలకు నగదు బదిలీ చేయాలని, ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. మనసు లేని ప్రభుత్వమైతేనే ఏమీ చేయకుండా ఉంటుందని స్పష్టం చేశారు.
"ఆకలి బాధ నుంచి రక్షించేందుకు కేంద్రం ప్రతి పేద కుటుంబానికి ఎందుకు నగదు బదిలీ చేయలేకపోయింది? 77 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల్లో కొద్దిమొత్తాన్ని కూడా కేంద్రం ఎందుకు ఉచితంగా అందించలేకపోయింది?" అంటూ ప్రశ్నించారు. ఈ రెండు ప్రశ్నలు ఆర్థికపరమైనవే కాకుండా, నైతికతతో కూడుకున్నవని, కానీ దేశం నిస్సహాయ స్థితిలో వీక్షిస్తుండగా, వీటికి జవాబు ఇవ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విఫలమయ్యారని చిదంబరం ఆరోపించారు.