Medical shop: ఆ మందులు కొంటున్నారా...అయితే మీ వివరాలు దుకాణంలో ఇవ్వాల్సిందే!
- జలుబు, దగ్గు, జ్వరం మందులు కొనాలంటే ఇది తప్పనిసరి
- పురపాలక శాఖ తాజా ఉత్తర్వులు జారీ
- మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారుల నిర్ణయం
దుకాణంలో మందు కొనాలంటే డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. కానీ చిన్నచిన్న సమస్యలకు దుకాణ నిర్వాహకులు ఈ నిబంధన పట్టించుకోరు. సమస్య చెప్పగానే తోచిన మందులు చేతిలో పెడతారు. ఇకపై ఇలా కుదరదండోయ్. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దగ్గు, జ్వరం, జలుబుకు మందులు కొనాలంటే ఇకపై అస్సలు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలోని మందుల దుకాణాల్లో ఇకపై వీటిని కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మీ ఫోన్ నంబరు, అడ్రస్ ఇవ్వాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నిన్న మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన సూచనల మేరకు అధికారులు ఈ ఆదేశాలు జారీచేశారు. ‘కరోనా లక్షణాల్లో జ్వరం, దగ్గు ప్రధానమైనవి. ఈ లక్షణాలు ఉన్నవారు డాక్టర్ చీటీ లేకుండా నేరుగా దుకాణాలకు వెళ్లి మందులు కొంటున్నారు. ఇకపై ఇలాకొన్న వారి వివరాలు దుకాణ నిర్వాహకులు తీసుకోవాలి. అయితే మందులు కొన్నవారి ప్రయోజనార్థమే చేస్తున్నట్టు వారిని ఒప్పించి అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకోవాలి’ అని పురపాక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు.
ఇందుకోసం మందుల దుకాణా యజమానులు, సంఘాల ప్రతినిధులు, ఫార్మాసిస్టు సంఘాల వారితో ఈ అంశంపై చర్చించి వివరించాలని అరవిందకుమార్ మున్సిపల్ కమిషనర్లు, బాధ్యులను ఆదేశించారు.