Vijayawada: రెడ్‌జోన్లలో కేసులు పెరగడానికి అదే కారణం : విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
- జనం ఇళ్లకే పరిమితం కావడం లేదు
- విచ్చలవిడిగా తిరుగుతుండడంతో వైరస్ విస్తరణ
- పోలీసుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం
రెడ్‌జోన్ల పరిధిలోని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఇది జరగడం లేదని, ఈ సమస్యే కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు అన్నారు. విజయవాడలో ఆరు రెడ్ జోన్లు ఉన్నాయి. వీటిని ఈరోజు పరిశీలించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘రెడ్‌జోన్లలో నివసిస్తున్న వారు 'ఇక్కడిక్కడే కదా' అన్న ఉద్దేశంతో నివాసాల సమీపంలో ఫ్రీగా తిరిగేస్తున్నారు. చుట్టుపక్కల పోలీసులు ఎంత గట్టినిఘా పెట్టినా ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదు. వీధుల్లో సంచారంతో వైరస్ వేగంగా విస్తరించి కేసులు పెరుగుతున్నాయి’ అని తెలిపారు.
బయట వ్యక్తులను లోపలకు అనుమతించక పోయినా లోపల ఉన్న వారు అక్కడ తిరుగుతుండడంతో సమస్య ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెడ్‌జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే, మొబైల్ వాహనాల్లో పోలీసులు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.
రెడ్‌జోన్లలో విధులు నిర్వహించే పోలీసుల వ్యక్తిగత భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, వారికి రక్షణ పరికరాలు అందజేస్తున్నామని తెలిపారు.