Fruits: ఈ నంబర్ కు ఫోన్ చేస్తే... రూ. 300కు ఆరు రకాల 12 కిలోలకు పైగా పండ్లు... హైదరాబాద్ లో హోమ్ డెలివరీ!
- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి
- పండ్ల హోమ్ డెలివరీకి అనూహ్య డిమాండ్
- కనీసం 30 ప్యాక్ లు ఆర్డర్ ఇస్తే, ఇంటికే పండ్లు
కరోనా నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న వేళ, ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొని వుండటంతో, హైదరాబాద్, కొత్తపేట పండ్ల మార్కెట్ నుంచి దాదాపు 12 కిలోలకు పైగా బరువుండే ఆరు రకాల పండ్ల ప్యాక్ ను రూ. 300కే హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఈ విధానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే పదివేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి.
ఇక ఈ ప్యాక్ లో భాగంగా ఒకటిన్నర కిలోల మామిడి, మూడు కిలోల బొప్పాయి, కిలో సపోట, రెండున్నర కిలోల బత్తాయి, 4 కిలోల పుచ్చకాయ, 12 నిమ్మకాయల ప్యాక్ ను అందిస్తున్నారు. అయితే, ఒక్క ప్యాక్ ను హోమ్ డెలివరీ చేయరు. కాలనీలు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీల వారు కనీసం 30 ప్యాక్ లు ఆర్డర్ ఇవ్వాల్సి వుంటుంది. ఆర్డర్ అందగానే, సదరు అడ్రస్ కు ఫ్రూట్ ప్యాక్స్ డెలివరీ చేస్తారు.
ఇక ఈ ఫ్రూట్ బాస్కెట్ లను పొందాలంటే 7330733212 నంబరుకు కాల్ చేయాల్సి వుంటుందని కొత్తపేట మార్కెట్ నిర్వహణా అధికారులు వెల్లడించారు. కోరిన వారందరికీ పండ్లను సరఫరా చేసేందుకు 64 టన్నుల పండ్లను, రెండు టన్నుల నిమ్మకాయలను సిద్దంగా ఉంచామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రైతులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఈ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.