Shiv Sena: రాజకీయ పరిణతి కనిపిస్తోందంటూ రాహుల్ గాంధీని ప్రశంసించిన శివసేన

Shivsena praises Rahul Gandhi as matured politician
  • కరోనా నేపథ్యంలో విభేదాలు పక్కనపెట్టాలని రాహుల్ నిర్ణయం
  • ఐక్యంగా పనిచేయాలంటూ పిలుపు
  • రాహుల్ నిర్ణయాన్ని కొనియాడిన శివసేన
  • 'సామ్నా' పత్రికలో సంపాదకీయం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఇటీవల కాలంలో విమర్శలే తప్ప పొగడ్తలు వచ్చింది చాలా తక్కువ. అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో శివసేన పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించింది. దేశాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న తరుణంలో రాహుల్ సిసలైన ప్రతిపక్ష నేతలా హుందాగా వ్యవహరిస్తున్నారని, ఆయనలో రాజకీయ పరిణతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని శివసేన పేర్కొంది. విపత్తు వేళ ఓ విపక్షం ఎలా వ్యవహరించాలో ఆయన తన వైఖరితో చాటిచెప్పారని, ప్రజాప్రయోజనాలకే పెద్దపీట వేసి అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నారని కొనియాడింది. ఈ మేరకు పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ప్రస్తావించింది.

"తనకు ప్రధాని మోదీతో విభేదాలు ఉన్నా ఇది వాదులాడుకునే తరుణం కాదని, అందరూ ఐక్యంగా పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాహుల్ పైనా, మోదీ, అమిత్ షాలపైనా భిన్న వాదనలు ఉన్నాయి. అయితే, బీజేపీ సక్సెస్ లో సగభాగం రాహుల్ గాంధీ ఇమేజిని దెబ్బతీసే క్రమంలోనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కానీ రాహుల్ మాత్రం క్రమశిక్షణకు కట్టుబడి, వివాదాల జోలికి పోకుండా ఓ ఆదర్శప్రాయుడిలా నిలిచారు" అంటూ శివసేన కీర్తించింది.
Shiv Sena
Rahul Gandhi
Congress
Lockdown
Corona Virus
Narendra Modi
India

More Telugu News