Jagan: ముఖ్యమంత్రి నివాసం రెడ్ జోన్ లో లేదు: గుంటూరు జిల్లా కలెక్టర్
- తాడేపల్లిలో కరోనా కారణంగా వృద్ధురాలు మృతి
- సీఎం జగన్ ఇల్లు రెడ్ జోన్ లో ఉందంటూ వార్తలు
- నాలుగు పాజిటివ్ కేసులు ఉంటేనే రెడ్ జోన్ అన్ని కలెక్టర్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం రెడ్ జోన్ లో ఉందంటూ వచ్చిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. తాడేపల్లి పాత గేట్ సమీపంలో ఉన్న మారుతి అపార్టుమెంటులో ఓ వృద్ధురాలు చనిపోయారు. విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. చనిపోయిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా... కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ఉంటున్న అపార్టుమెంట్ జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే ఉంది. దీంతో, జగన్ నివాసం రెడ్ జోన్ లో ఉందనే ప్రచారం మొదలైంది.
ఈ వార్తలపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ స్పందించారు. సీఎం నివాసం రెడ్ జోన్ లో ఉందనే వార్తలను ఖండించారు. నాలుగు పాజిటివ్ కేసులున్న ప్రాంతం మాత్రమే రెడ్ జోన్ లోకి వస్తుందని ఆయన తెలిపారు. తాడేపల్లిలో కేవలం ఒక్క కేసు మాత్రమే ఉన్నందున రెడ్ జోన్ పరిధిలోకి రాదని చెప్పారు.