Corona Virus: యాంటీబాడీ టెస్టులు ఎందుకు చేస్తారు? వాటి వల్ల ఉపయోగం ఎంత?
- ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా రక్కసి
- యాంటీబాడీ టెస్టులకు పెరుగుతున్న ప్రాధాన్యత
- ముఖ్యంగా ర్యాపిడ్ టెస్టులకు అనేక దేశాల మొగ్గు
యావత్ ప్రపంచం కరోనా వైరస్ ను ఏకైక శత్రువుగా భావించి యుద్ధం చేస్తోన్న తరుణంలో అనేక దేశాలు యాంటీబాడీ టెస్టుల వైపు మొగ్గు చూపుతున్నాయి. అమెరికాలోని వైద్య సిబ్బందికి, వుహాన్ పౌరులకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు. సాధారణంగా యాంటీబాడీ టెస్టులనే సెరాలజీ టెస్టులంటారు. ఈ పరీక్ష ద్వారా ఎవరు ఇన్ఫెక్షన్ కు గురయ్యారు? ఎవరు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు? అనే విషయాలు వెల్లడించవచ్చు.
సహజంగా మానవుడు ఏదైనా వ్యాధికి గురైనప్పుడు శరీరంలో ఆ వ్యాధికారక క్రిములతో పోరాడేందుకు యాంటీబాడీలు తయారవుతాయి. యాంటీబాడీ టెస్టు చేయడం ద్వారా సదరు వ్యక్తి ఏ వైరస్ తో పోరాడుతున్నాడన్న విషయం తెలిసిపోతుంది. ఇక ఈ యాంటీబాడీ టెస్టుల్లో రెండు రకాలున్నాయి. అస్సే టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్.
అస్సే టెస్టులో శాంపిల్స్ సేకరించిన అనంతరం అనేక దశల్లో పరీక్షించి అత్యంత కచ్చితత్వంతో ఫలితాలు వెల్లడిస్తారు. ఇందుకు కాస్త సమయం పడుతుంది. ర్యాపిడ్ టెస్టు విషయానికొస్తే ఎక్కడైనా ఈ పరీక్ష నిర్వహించవచ్చు. వేలికి సూది గుచ్చి బ్లడ్ శాంపిల్ తీసి అక్కడికక్కడే పరీక్ష చేస్తారు. స్వల్ప సమయం పడుతుండడంతో చాలా దేశాలు ర్యాపిడ్ టెస్టులను ప్రోత్సహిస్తున్నాయి. పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే, వీటి విశ్వసనీయతపై సందేహాలున్నాయి.
కరోనా నుంచి కోలుకున్న అనేకమంది శాంపిల్స్ ను పరీక్షించగా, ఆశ్చర్యకరంగా వారిలో చాలా తక్కువ యాంటీబాడీలు కనిపించాయి. వాస్తవానికి ఏ వ్యక్తైనా వైరస్ కారక వ్యాధి నుంచి కోలుకుంటే అతడిలో హెచ్చు సంఖ్యలో యాంటీబాడీలు ఏర్పడి ఉంటాయి. కరోనా విషయంలో ఈ సిద్ధాంతం విశ్వసనీయంగా లేకపోవడంతో యాంటీబాడీ టెస్టులపై కొద్దిమేర వ్యతిరేక భావనలు నెలకొన్నాయి.