Nitish Kumar: ఇది అన్యాయం... విద్యార్థుల కోసం బస్సులు పంపాలన్న యూపీ నిర్ణయంపై నితీశ్ తీవ్ర అభ్యంతరం
- రాజస్థాన్ లో నిలిచిపోయిన వేల మంది యూపీ విద్యార్థులు
- 300 బస్సులు పంపుతున్న యోగి సర్కారు
- వలస కార్మికుల సంగతేంటన్న నితీశ్ కుమార్
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన వేల మంది విద్యార్థులు రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారందరూ వివిధ కోచింగ్ ల కోసం రాజస్థాన్ వెళ్లారు. అయితే, వారిని యూపీ తీసుకువచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు 300 బస్సులను రాజస్థాన్ పంపాలని నిర్ణయించింది.
దీనిపై బీహార్ సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అన్యాయం అంటూ ఆక్రోశించారు. దేశవ్యాప్తంగా కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయాలన్న లాక్ డౌన్ నిర్ణయానికి ఇది వ్యతిరేకం అని ఆరోపించారు. భౌతిక దూరం పాటించడమే కరోనా కట్టడిలో కీలకమని తెలిసి కూడా వేలమందిని తరలించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. అనేక రాష్ట్రాలు విద్యార్థులకు మాత్రం సకల సదుపాయాలు కల్పిస్తూ, వలస కార్మికుల విషయంలో మాత్రం సాకులు చెబుతున్నాయని నితీశ్ కుమార్ విమర్శించారు.