Tiger: మధ్యప్రదేశ్ లో పులుల విజృంభణ... వారం రోజుల వ్యవధిలో ముగ్గురు బలి
- తాజాగా టీనేజ్ యువతిని చంపిన పెద్దపులి
- మహువా పూల సేకరణకు వెళుతున్న మహిళలపై పంజా
- పూల సేకరణకు వెళ్లొద్దన్న అధికారులు
మధ్యప్రదేశ్ లో పెద్దపులుల దాడికి వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు బలయ్యారు. తాజాగా పెంచ్ పులుల సంరక్షణ ప్రాంతంలో ఓ 18 ఏళ్ల యువతి పులికి బలైంది. మృతురాలిని సంతోషి బాల్ చంద్ గా గుర్తించారు. ఆమె స్థానికంగా దొరికే మహువా పూల (ఇప్పపూలు)ను సేకరించేందుకు తుయిపానీ అటవీప్రాంతానికి వెళ్లగా, అక్కడే పొంచి ఉన్న పెద్దపులి ఒక్కుదుటున లంఘించి మెడ పట్టుకుని చంపేసింది. మృతదేహాన్ని తినకుండానే ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
గత బుధవారం ఓ అమ్మాయిని ఇలాగే చంపిన ఆడపులిని అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించారు. రెండ్రోజుల క్రితం బంధావ్ గఢ్ టైగర్ రిజర్వ్ లో ఖిటోలీ ప్రాంతంలో ఓ మహిళను ఆడపులి చంపేసింది. దీనిపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ, బఫర్ జోన్ లో ఎవరూ మహువా పూల సేకరణకు వెళ్లొద్దని హెచ్చరించారు. పూలు సేకరిస్తున్న మహిళలను పులులు జంతువులుగా భావించి చంపుతుండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా, ఒకరకం మద్యం తయారీలో ఇప్పపూలను వాడుతారు. దాంతో వీటిని అమ్ముకోవడానికి ఈ పూల సేకరణకు ఇలా అడవులకు వెళుతుంటారు.