Corona Virus: ఈ నెల 19న భేటీ కానున్న తెలంగాణ కేబినెట్.. లాక్‌డౌన్ సడలింపులు, ఎత్తివేతపై కీలక చర్చ
- ప్రగతి భవన్‌లో భేటీకి నిర్ణయం
- సడలింపులు ఇస్తే ఎటువంటి సడలింపులు ఇవ్వాలి అనే అంశాలపై చర్చ
- తీసుకోవాల్సిన కరోనా నివారణ చర్యలపై చర్చ
- తెలంగాణలో 650కి చేరిన కేసులు
తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ ఈ నెల 19న సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రారంభమయ్యే ఆ సమావేశంలో ముఖ్యంగా లాక్‌డౌన్ ఎత్తివేత లేక పొడిగింపు, సడలింపుల అంశాలను చర్చించనున్నారు.
మే 3 వరకు లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలా? వద్దా? అన్న అంశాలపై కేసీఆర్ మంత్రుల సలహాలు తీసుకోనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే ఎటువంటి సడలింపులు ఇవ్వాలి? అనే అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.
అలాగే, సడలింపులు ఇచ్చాక తీసుకోవాల్సిన కరోనా నివారణ చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై నిర్ణయాలు తీసుకుని కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణలో నిన్న కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 650కి చేరింది.
తెలంగాణలో కేసుల పెరుగుదల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా భారీగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న కేవలం ఆరు కేసులే నమోదు అయినప్పటికీ మళ్లీ కేసుల్లో పెరుగుదల భారీగా నమోదయ్యే అవకాశమూ లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా కేసుల పెరుగుదల తగ్గి ఒక్కసారిగా పదుల సంఖ్యలో పెరిగిపోయిన విషయం తెలిసిందే.