Corona Virus: కాణిపాకం ఆలయంపై తప్పుడు పోస్టులు... చిత్తూరు జైలుకు తెలంగాణ వ్యక్తి!

Telangana Person Sent to Chittor Jail For Fake Post on Kanipakam Temple

  • తప్పుడు పోస్టులపై పోలీసుల సీరియస్
  • కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్ చేశారని ప్రచారం
  • సిద్ధిపేట వాసిని అరెస్ట్ చేసి చిత్తూరు తరలించిన ఏపీ పోలీసులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా, చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంపై తప్పుడు పోస్టులను ప్రచారం చేయడంతో పాటు తమ వాట్సాప్ ఖాతాల ద్వారా ఎంతో మందికి పంపిన తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేటకు చెందిన ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణువర్ధన్‌ రెడ్డి (56) తన ఫేస్‌ బుక్, ట్విటర్‌ ఖాతాల ద్వారా, కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌ గా మార్చారంటూ ప్రచారం చేశాడు. దీనిపై కాణిపాకం ఆలయం ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విష్ణు వర్ధన్ రెడ్డిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.

కాగా, ఈ కేసులో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలు శిక్షపడుతుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఓ కాలనీ పేరును చెబుతూ, అక్కడ అన్ని కేసులు వచ్చాయని ప్రచారం చేయడం తప్పని, వైరస్ పాజిటివ్ వచ్చిన వారి చిత్రాలను పోస్ట్ చేస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News