Telangana: 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి మార్పులుంటాయి: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- అప్పటి పరిస్థితిని బట్టి మార్పుచేర్పులు ఉండొచ్చు
- కరోనా నుంచి కోలుకున్న 128 మంది రేపు డిశ్చార్జ్
- సరిపడా టెస్టింగ్ కిట్లు ఉన్నాయన్న సీఎం
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 20 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగుతుందని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు, చేర్పులు ఉండొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లాక్‌డౌన్ అమలుపై ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న ఉన్నతాధికారులు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 514 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని, వైరస్ నుంచి కోలుకున్న 8 మందిని ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. రేపు (గురువారం) మరో 128 మందిని డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంతమందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదు లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్టు వివరించారు. అలాగే, 3.25 లక్షల ఎన్-95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదు లక్షల మాస్కులకు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో బియ్యం పంపిణీ పూర్తయిందని, ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు చెప్పారు.