Antiviral Drug: ఎబోలా చికిత్సకు వాడిన డ్రగ్‌తో కరోనాను నయం చేయొచ్చు: ఐసీఎంఆర్
- రెమ్ డెసివిర్ డ్రగ్ బాగా పని చేసే అవకాశం ఉంది
- ఇప్పటికే ముగ్గురిపై ప్రయోగించారని వెల్లడి
- భారత్‌లో ఎవరైనా డ్రగ్ తయారు చేస్తే వాడుతామన్న సంస్థ
ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించిన యాంటీ వైరస్ డ్రగ్ ‘రెమ్ డెసివిర్’ .. కరోనా వైరస్ పై సమర్థవంతంగా పని చేయగలదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) సాలిడారిటీ ట్రయల్ లో ఇది తేలాల్సి ఉందని ప్రకటించింది. వెంటిలేటర్ పై ఉన్న ముగ్గురు పేషెంట్లలో ఇద్దరికి ఇది పని చేసిందని న్యూ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ అధ్యయనాన్ని ప్రచురించిందని తెలిపింది.
దీనిపై ఐసీఎంఆర్ కు చెందిన మహమ్మారి, సంక్రమణ వ్యాధుల విభాగం అధిపతి రామన్ గంగాఖేడ్కర్ మాట్లాడుతూ.. ఎబోలా వైరస్ చికిత్స కు ఈ డ్రగ్ ను వాడినట్లు చెప్పారు. కరోనాకు చికిత్సలోనూ ఇది బాగా పని చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే అధ్యయనంలో చెప్పిన ప్రకారం ఇది క్లినికల్ ట్రయల్ కాదని, ఓ పరిశీలన మాత్రమేనని చెప్పారు. ముగ్గురిలో ఇద్దరికి ఈ డ్రగ్ వాడిన తర్వాత వాళ్లకు వెంటిలేటర్ అవసరం ఏర్పడలేదన్నారు. రెమ్ డెసివిర్ మెడిసిన్ ను గిలీడ్ సైన్సెస్ ఇంక్ కంపెనీ అభివృద్ధి చేసిందని, దేశంలో ప్రస్తుతం ఇది అందుబాటులో లేదన్నారు. మన దేశంలోని ఏదైనా ఫార్మా సంస్థ ఈ మెడిసిన్ ను తయారు చేస్తే చికిత్సకు వాడొచ్చని చెప్పింది.