Telangana: తెలంగాణలో లాక్ డౌన్ నుంచి మినహాయింపు పొందే అవకాశమున్న ప్రాంతాలివి!

These Areas in Telangana Can Exempt From Lockdown

  • ఐదు జిల్లాలను అసలు తాకని మహమ్మారి
  • మరికొన్ని జిల్లాల్లో తగ్గిన వైరస్ ప్రభావం
  • రాష్ట్రాలదే తుది నిర్ణయమన్న కేంద్రం
  • ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు

కరోనా వైరస్ తెలంగాణలో ఇప్పటివరకూ ఐదు జిల్లాలను అసలు తాకనేలేదు. మరో ఆరు జిల్లాల్లో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఈ 11 జిల్లాల్లో కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల నుంచి ప్రజలకు కొంతమేరకు ఉపశమనం లభించవచ్చని తెలుస్తోంది. నిబంధనల మినహాయింపుపై రాష్ట్రాల ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నిబంధనల తొలగింపుపై కేసీఆర్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రంలోని నారాయణ పేట, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో మహబూబాబాద్‌, సిద్దిపేట, ములుగు, నాగర్‌ కర్నూలు, జగిత్యాల తదితర జిల్లాల్లో ఒకటి నుంచి రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మార్చిలో వెలుగులోకి వచ్చినవే. ఏప్రిల్ లో ఈ జిల్లాల నుంచి ఒక్క కేసు కూడా రాకపోవడంతో ఈ ప్రాంతాలనూ మినహాయింపు జాబితాలో చేర్చేందుకు వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, మొత్తం 30 సర్కిళ్లు ఉండగా, హయత్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మాత్రమే ఒక్క కేసు కూడా రాలేదు. మిగతా 28 సర్కిళ్లలో కేసులు ఉండటంతో, ఈ ప్రాంతంలో నిబంధనలను సడలిస్తే, ప్రజలను నియంత్రించడం కష్టమవుతుందన్న నేపథ్యంలో, ప్రస్తుతానికి మినహాయింపులు ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇక కరోనా సోకని, ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినా, అన్ని కార్యకలాపాలనూ జిల్లాల సరిహద్దుల వరకే పరిమితం చేసేలా అధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు. జిల్లాల సరిహద్దులను మూసే ఉంచుతారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతాల్లో వ్యవసాయ పనులను పూర్తి స్థాయిలో చేసుకునేందుకు, చిన్న ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలను అనుమతించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని, ప్రభుత్వానికి కొంతయినా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News