Maharashtra: బైక్‌పై ఇంటికెళ్లేందుకు యువకుల 'చావు' ప్లాన్.. చివర్లో దొరికిపోయి క్వారంటైన్‌కు!

Biker plans killing drama to go home in Maharashtra

  • 380 కిలోమీటర్ల దూరంలోని సొంతూరుకు బైక్‌పై యువకులు
  • కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోయినట్టు పోలీసులకు అబద్ధం 
  • ఇంట్లో వాళ్లను కూడా సిద్ధం చేసినా చివర్లో దొరికిపోయిన వైనం

లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులు 380 కిలోమీటర్ల దూరంలో రత్నగిరికి సమీపంలోని సొంతూరికి బైక్‌పై వెళ్లేందుకు బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. 200 కిలోమీటర్లు బాగానే వచ్చేశారు. చివర్లో పోలీసులకు అనుమానం రాకుంటే వారు చక్కగా ఇంటికి చేరుకునేవారే. కానీ పోలీసులకొచ్చిన అనుమానం వారిని క్వారంటైన్ పాలు చేసింది. ఎలాగైనా సొంతూరికి వెళ్లేందుకు రెడీ అయిన యువకులు ఇందుకోసం తమ ఇంట్లో ఒకరు చనిపోయినట్టుగా కథ అల్లారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి పోలీసులు ఫోన్ చేస్తే అలానే చెప్పాలని వారిని కూడా సిద్ధం చేశారు.

అంతా బాగానే ఉందనుకున్నాక బైక్‌పై బయలుదేరారు. చెక్ పోస్టుల వద్ద పోలీసులు ఆపిన ప్రతిసారీ ఇదే విషయాన్ని చెప్పారు. వారు అనుమానంతో ఇంటికి ఫోన్ చేస్తే కుటుంబ సభ్యులు కూడా అలాగే చెప్పడంతో వదిలేశారు. అలా దాదాపు 200 కిలోమీటర్ల దూరం వచ్చేశారు. ఇక తిరుగులేదనుకున్న యువకులకు ఖేడ్ పట్టణ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు బ్రేక్ వేశారు.

పోలీసులు వీరిని ఆపితే అందరికీ చెప్పిన స్టోరీనే వీరికీ వినిపించారు. అయితే, యువకుల తీరు అనుమానంగా ఉండడంతో వారి మాటలు నమ్మబుద్ధి కాలేదు. అందరి పోలీసుల్లా వీరు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకుండా స్థానిక పోలీసులకు ఫోన్ చేసి విషయం కనుక్కొమ్మని చెప్పారు. వారెళ్లి ఆరా తీయగా అక్కడ అటువంటిదేమీ లేదని చెప్పారు. దీంతో యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బైక్ స్వాధీనం చేసుకుని వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

  • Loading...

More Telugu News