Ayush: ఇంట్లో దొరికే వాటితో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే చిట్కాలు ఇవిగో!
- తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తులపై కరోనా దాడి
- వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలన్న ప్రధాని మోదీ
- ఆయుష్ మంత్రిత్వ శాఖ చిట్కాలు పాటించాలని సూచన
ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో వ్యాధి నిరోధక శక్తి గురించి కూడా మాట్లాడారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకునే మార్గాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులపై దాడి చేస్తుందని వైద్య నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవలే కొన్ని సూచనలు చేసింది. మన ఇంట్లో దొరికే వాటితో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవచ్చో వివరించింది
- ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలి.
- పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా వంటల్లో ఉండేలా చూసుకోవాలి.
- తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి మిశ్రమంతో కూడిన కషాయం రోజుకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ తాగాలి.
- ఒక గ్లాసు వేడి పాలలో అరస్పూను పసుపు వేసి రంగరించి తాగాలి. ఎన్నో ఏళ్లుగా, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఇది తిరుగులేని చిట్కా.
- ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే నెయ్యి కానీ ముక్కులో కొన్ని చుక్కలు వేసుకోవాలి.
- ఒక టేబుల్ స్పూను నువ్వుల నూనె లేదా వంట కోసం ఉపయోగించే కొబ్బరినూనె నోట్లో వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించాలి. ఆ తర్వాత వేడినీళ్లతో నోటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ చేయాలి.
- అందుబాటులో ఉంటే ఓ టేబుల్ స్పూన్ చ్యవన్ ప్రాష్ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది.