Google: కరోనాపై పోరుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం
- స్వచ్ఛంద సంస్థ గివ్ ఇండియాకు విరాళం అందించిన సుందర్ పిచాయ్
- కరోనాపై పోరుకు గత నెలలో 800 మిలియన్ డాలర్లు ప్రకటించిన గూగుల్
- నెరోలాక్ రూ. 4 కోట్ల విరాళం
మహమ్మారి కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేయి కలిపారు. స్వచ్ఛంద సంస్థ ‘గివ్ ఇండియా’కు రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. దేశంలో కరోనా కారణంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు గివ్ ఇండియా ఇప్పటికే రూ.12 కోట్లు సేకరించింది. కాగా, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తల కోసం గూగుల్ గత నెలలో 800 మిలియన్ డాలర్లను ప్రకటించింది.
మరోవైపు, డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం 4 లక్షల మాస్కులు, పరిశుభ్రతకు ఉపయోగించే 10 లక్షల ఉత్పత్తులను సైన్యం, సీఆర్‌పీఎఫ్, ఆరోగ్య సేవల సిబ్బందికి అందించింది. కెన్సాన్ నెరోలాక్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 4 కోట్ల విరాళం ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పీఎం కేర్స్ ఫండ్‌కు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ రూ. 26 కోట్లు అందించింది.