Kodali Nani: ఏపీలో ఈ నెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ: మంత్రి కొడాలి నాని
- రెండో విడతలో భాగంగా 5 కిలోల బియ్యం, కేజీ శనగలు
- 14 వేల రేషన్ షాపులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం
- రైతుల నుంచి నేరుగా వారి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు
ఏపీలో ఈ నెల 16 నుంచి రెండో విడత రేషన్ ను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండో విడతలో భాగంగా 5 కిలోల బియ్యం, కేజీ శనగలు ఇస్తామని చెప్పారు. 14 వేల రేషన్ షాపులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రేషన్ కూపన్ పై ఉన్న ఆయా తేదీల్లో మాత్రమే వినియోగదారులు రేషన్ దుకాణాల వద్దకు రావాలని సూచించారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రేషన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ నేరుగా వారి గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తుందని, గ్రామసచివాలయాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.