Ghost: వీధుల్లో దయ్యాలు.. కరోనా నేపథ్యంలో ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసేందుకు గ్రామ పెద్దల ప్లాన్!
- ఇండోనేషియాలో దయ్యాల పట్ల విపరీతమైన మూఢనమ్మకాలు
- ప్రజల్లో భయాన్ని కరోనా కట్టడికి వాడుకుంటున్న కెపూ గ్రామ పెద్దలు
- వ్యక్తులకు దయ్యాల వేషాలు వేసి పలు చోట్ల మోహరింపు
దయ్యాలు, భూతాలు ఉన్నాయని ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ నమ్ముతారు. ప్రస్తుతం కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇండోనేషియాలోని ఓ గ్రామం దయ్యాల భయాన్ని కరోనా కట్టడి కోసం వాడుకుంటోంది. జావా దీవిలోని కెపూ అనే గ్రామంలో రాత్రివేళ దయ్యాల వంటి ఆకారాలు సంచరిస్తుండడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. వాస్తవానికి అవి నిజమైన దయ్యాలు కావు. కొందరికి పైనుంచి కిందివరకు తెల్ల దుస్తులు తొడిగి, వారిని గ్రామంలో అక్కడక్కడ మోహరిస్తున్నారు.
ఇండోనేషియాలో దయ్యాల పట్ల మూఢనమ్మకాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో రాత్రివేళ బయటికి రావాలంటే అక్కడివారు జంకుతారు. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని కెపూ గ్రామ పెద్దలు పోలీసుల సాయంతో దయ్యాల ప్లాన్ వేసి కరోనా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇండోనేషియాలో పోకోంగ్ అంటే దయ్యం అని అర్థం. అక్కడి జానపదాల్లో పోకోంగ్ లను అత్యంత భయంకరంగా వర్ణిస్తుంటారు. దాంతో సహజంగానే అక్కడి పౌరులకు చిన్ననాటి నుంచి పోకోంగ్ అంటే ఓ రకమైన భయం ఆవహిస్తుంది.
ఇప్పుడు కెపూ గ్రామంలో ఈ పోకోంగ్ లు కనిపిస్తున్నాయని, అందుకే తాము బయటికి వెళ్లడం మానుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు, సాయంకాల వేళల్లో జరిగే ప్రార్థనలకు కూడా ఎవరూ వెళ్లడంలేదు. ఈ పొకోంగ్ లను చూసి పెద్దలే జడుసుకుంటుండడంతో పిల్లలు గడప కూడా దాటడంలేదట! ప్రస్తుతం ఇండోనేషియాలో 4,241 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 373 మంది మరణించారు.