Plasma Theraphy: కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో రోగులకు చికిత్స: ఎయిమ్స్ డైరెక్టర్
- గతంలో ఎబోలాకు ఇదే తరహా చికిత్స
- రోగిలో రోగనిరోధక శక్తిని పెంచే రక్తంలోని ప్లాస్మా
- ప్లాస్మా థెరపీకి ఇప్పటికే ఐసీఎంఆర్ అనుమతి
కరోనా వైరస్ సోకి, ఆపై నెగటివ్ వచ్చిన వారి రక్తంతో, పాజిటివ్ గా ఉన్న రోజులకు సత్వర చికిత్సను అందించవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రత్నదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. "వ్యాధిగ్రస్థుడిలో ప్లాస్మాను మార్చే చికిత్స సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి, వాటిని రోగిలోకి ఎక్కించడం ద్వారా, అతని శరీరంలో మహమ్మారిపై పోరాడే యాంటీ బాడీస్ ను వృద్ధి చేయవచ్చు" అని ఆయన అన్నారు.
కరోనా రోగి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ ప్లాస్మా పెంచుతుందని ఆయన అన్నారు. ఈ తరహా యాంటీ బాడీలను అధికంగా కలిగివున్న రోగి, చికిత్స తరువాత కోలుకుంటే, అతని రక్తాన్ని దానం చేయాలని కోరవచ్చని, దాన్నుంచి తీసే ప్లాస్మాను మరో రోగికి ఎక్కించడం ద్వారా, అతన్ని త్వరగా కరోనా నుంచి బయటపడేయవచ్చని తెలిపారు. గతంలో ఎలోబా వంటి వైరస్ లు విజృంభించినప్పుడు, ఇదే తరహా ప్లాస్మా థెరపీని వాడినట్టు ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నారని, అక్కడి నుంచి వెలువడే గణాంకాలు కరోనాపై పోరులో ఉపయుక్తకరమని భావిస్తే, భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామని రత్నదీప్ వెల్లడించారు. కాగా, ప్లాస్మా థెరపీని అమలు చేసేందుకు కేరళలోని శ్రీ చిత్రా తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐసీఎంఆర్ అనుమతి నిచ్చింది.