Sangareddy District: సద్దుమణిగిందన్న సమయంలో సంగారెడ్డిలో మరో కరోనా కేసు... మర్కజ్ వెళ్లి రాగానే నెగటివ్... ఇప్పుడు పాజిటివ్!
- 25 మందిని క్వారంటైన్ చేసిన అధికారులు
- అందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయం
- రెడ్ జోన్ లను అమలు చేస్తున్నామన్న అధికారులు
కరోనాకు అడ్డుకట్ట వేశామని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావించిన సంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మరోసారి ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. తాజాగా జహీరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. ఇతను కూడా ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తే కావడం గమనార్హం.
వాస్తవానికి ఇతనితో పాటు మరో ఐదుగురిని గత నెల 31న గాంధీ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ, వీరందరినీ పరిశీలనలోనే ఉంచిన అధికారులు, తాజాగా మరోసారి పరీక్షలు జరిపారు. దీనిలో ఓ వ్యక్తి శాంపిల్, కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, అతనితో సంబంధమున్న 25 మందిని క్వారంటైన్ చేశారు.
వీరందరినీ జహీరాబాద్ కు సమీపంలో ఏర్పాటు చేసిన నారాయణ కాలేజీ క్వారంటైన్ సెంటర్ లో ఉంచామని, అందరి నుంచి శాంపిల్స్ సేకరించి, సీసీఎంబీకి పంపించామని తెలిపారు. కాగా, ఈ 25 మందిలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబాలకు చెందిన వారు 13 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులు వచ్చిన ప్రాంతాలన్నింటినీ హాట్ స్పాట్ లుగా ఇప్పటికే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించామని అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లకు చుట్టూ కిలో మీటర్ పరిధిలో రసాయనాల పిచికారీ జరుగుతోందని వెల్లడించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఉంటే, మునిసిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, రెడ్ జోన్లను దాటి ఎవరైనా బయటకు వచ్చినా, బయటివారు లోపలికి వెళ్లినా కేసులు పెడతామని హెచ్చరించారు.