Hydroxychloroquine: కరోనాతో అల్లాడుతున్న అమెరికాకు చేరిన భారత ఔషధాలు.. అమెరికా హర్షం
- క్లోరోక్విన్‌తో పాటు ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు
- నిన్న సాయంత్రం న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరిక
- అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన
అమెరికాలో కరోనా విజృంభణ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపింది.
ఆ డ్రగ్స్‌తో పాటు ఇతర ప్రాణాధార ఔషధాలు కూడా ప్రత్యేక కార్గో విమానంలో నిన్న సాయంత్రం న్యూజెర్సీలోని నెవార్క్ అంతర్జాతీయ విమానానికి చేరుకున్నాయి. ఈ విషయంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన చేసింది.
అమెరికా అధ్యక్షుడి వినతి మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపుతామని ఇటీవలే భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, వీటితో పాటు పలు ఔషధాలను పంపుతామని భారత్ తెలిపింది.
'కొవిడ్-19పై పోరులో మన భాగస్వామ్య దేశానికి సాయం చేయడానికి భారత్ నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నాయి' అని అమెరికాలో భారత రాయబారి తరాంజిత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు.
కాగా, అమెరికాలో ఇప్పటివరకు 5,33,259 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు ఆ దేశంలో 20,597 మంది మృతి చెందారు. మొదట హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధించిన భారత్ ఆ తర్వాత దాన్ని పాక్షికంగా ఎత్తేసింది. ఇప్పటికే పలు దేశాలకు భారత్ సాయం చేసింది.
భారత్ నుంచి ఔషధాలు చేరుకోవడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోంది. 'భారత్ చేసిన సాయాన్ని అమెరికా ఎన్నటికీ మర్చిపోదు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఇరు దేశాల మధ్య స్నేహ బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది' అని న్యూయార్క్‌లోని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
అవసరమైన సమయంలో అమెరికాకు భారత్ ఔషధాలు పంపిందని మరో అధికారి అన్నారు. మలేరియాతో పాటు రుమటాయిడ్ వంటి వ్యాధులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడతారు. ఈ డ్రగ్స్ వల్ల కరోనాకు కూడా చికిత్స అందించవచ్చని కొందరు వైద్య నిపుణులు చెబుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ డ్రగ్స్ భారత్‌లో విరివిగా లభ్యమవుతాయి. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు భారత సాయాన్ని కోరుతున్నాయి.