Red Zone: రెడ్ జోన్ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కఠిన నిబంధనలు ఇవే!

Tough Measures in Corona Red Zone Areas
  • కరోనా కేసులు ఎక్కువగా నమోదైతే రెడ్ జోన్
  • ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు
  • ఇతరులు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా చర్యలు
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్  లుగా ప్రకటించిన అధికారులు, అక్కడ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా, ఏ ప్రాంతంలో అయితే, ఇతరులకు కరోనా వైరస్ సోకిందో, ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక ఇక్కడి ప్రజలు ఎవరకీ బయటకు వచ్చేందుకు వీలు లేదు. వీధిలోకి కాదుగదా... కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా వీల్లేదు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలను అధికారులే ఇళ్ల వద్దకు చేరుస్తారు. వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి వుంటుంది.

తమ పక్క వీధిలో ఉంటున్న వారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నా, రెడ్ జోన్ పరిధిలోని వారు ఎంతో అత్యవసరమైతే, అది కూడా పోలీసుల అనుమతితోనే బయటకు రావాల్సి వుంటుంది. ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు బయటివారెవరికీ అనుమతి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ జోన్ వీధుల్లోకి ఇతరులను అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు. ఇక రెడ్ జోన్ ప్రాంతానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేయిస్తున్నారు.

సదరు ప్రాంతానికి వెళ్లే అన్ని వైపులనూ బారికేడ్లతో దిగ్బంధించే పోలీసులు, ఆ ప్రాంతం రెడ్ జోన్ అని సూచించే బోర్డులను పెడతారు. అక్కడ 24 గంటలూ పోలీసు కాపలా ఉంటుంది. గుర్తింపు పొందిన అధికారులు, హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్రమే బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో మహమ్మారి ఉందని సూచించేలా ప్రత్యేక స్టిక్కర్లను అంటిస్తారు.

ఇక ఈ ప్రాంతంలోని వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో, రోజుకు రెండు సార్లు హెల్త్ వర్కర్లు పరీక్షిస్తుంటారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారి నమూనాలను సేకరించి, క్వారంటైన్ చేస్తారు. రెడ్ జోన్ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు కఠిన ఆంక్షలుంటాయని, ఈలోగా కొత్త కేసులు రాకుండా ఉంటేనే నిబంధనలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త కేసులు వస్తే, ఆపై మరో 14 రోజులు ఇవే ఆంక్షలుంటాయని అధికారులు వెల్లడించారు.
Red Zone
Corona Virus
Police

More Telugu News