Julian Asanje: ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందుతూ న్యాయవాదితో అసాంజే రాసక్రీడలు... ఇద్దరు బిడ్డలను కన్నానంటున్న యువతి!
- 2011లో తొలిసారి కలిసిన వెంటనే ప్రేమలో పడ్డాను
- అసాంజే కారణంగా తనకు గాబ్రియేల్, ఓల్డ్ మాక్స్ పుట్టారంటున్న స్టెల్లా మోరిస్
- లండన్ జైలు నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి
వికీలీక్స్ వ్యవస్థాపకుడు, అమెరికా సహా పలు దేశాల విచారణను తప్పించుకునేందుకు లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్న వేళ, జూలియన్ అసాంజే, తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యారని, ఆయన తరఫున వాదనలు వినిపించిన ఓ న్యాయవాది ఆరోపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తనకు తాను అసాంజే భాగస్వామిగా చెప్పుకున్న ఆమె వీడియో ఇప్పుడు వికీలీక్స్ తో పాటు ది డెయిలీ మెయిల్ పోస్ట్ చేశాయి.
ఈ వీడియోలో లేడీ లాయర్ స్టెల్లా మోరిస్ చెబుతున్న వివరాల ప్రకారం, అసాంజే కారణంగా ప్రస్తుతం రెండేళ్ల వయసున్న గాబ్రియేల్, ఏడాది వయసున్న ఓల్ట్ మాక్స్ ఆమెకు జన్మించారు. ప్రస్తుతం యూఎస్ నిఘా విభాగం అధికార పత్రాల లీక్ కేసులో, స్వీడన్ లో అత్యాచార కేసు ఆరోపణలను ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఈక్వెడార్ ఎంబసీ ఆయన్ను గెంటేసిన అనంతరం, లండన్ జైలుకు ఆయన్ను తరలించగా, ప్రస్తుతం ఆయన్ను విడిచి పెట్టాలని మోరిస్ కోరారు.
స్వీడన్ జాతీయురాలైన మోరిస్, బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. ఆమె అసాంజేకు న్యాయవాదిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం అసాంజే ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయన మానసికంగా కుంగిపోయారని, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఉన్నాయని, లండన్ జైల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే తాను తమ మధ్య ఏర్పడిన బంధంపై మాట్లాడుతున్నానని వివరించారు. వెంటనే విడుదల చేయకుంటే, ఆయన తన జీవితాన్ని ముగించినట్టేనని తనకు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
మోరిస్ వెల్లడించిన విషయాలపై ఈక్వెడార్ ఎంబసీ ఇంతవరకూ స్పందించలేదు. వికీ లీక్స్ గానీ, అసాంజే లాయర్ కూడా అధికారికంగా ఎటువంటి వివరణా ఇవ్వలేదు. 2011లో తాను అసాంజేను తొలిసారిగా కలిశానని, ఆ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడ్డానని, ఆపై అతని అంతర్జాతీయ న్యాయవాదుల బృందంలో చేరానని చెప్పిన మోరిస్, ఆపై ప్రతి నిత్యమూ ఎంబసీలో అతనితోనే కలిసున్నానని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో అసాంజే గురించి తనకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మోరిస్ మాట్లాడిన వీడియోను మీరూ చూడవచ్చు.