Foreihners: గంగానది ఒడ్డున షికార్లు చేస్తున్న విదేశీయులతో 500 సార్లు 'సారీ' రాయించిన పోలీసులు
- కరోనా ప్రభావంతో ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్
- రిషికేశ్ లో విదేశీయుల సంచారం
- చర్యలు తప్పవన్న పోలీసులు
కరోనా వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమ శక్తిమేరకు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ కూడా లాక్ డౌన్ విధించినా, కొంతమేర ఆంక్షలు సడలించింది. అయితే అది నిత్యావసరాల కొనుగోళ్లు, ఇతర అత్యవసర పనుల కోసం మాత్రమే. కారణం లేకుండా బయట కనిపిస్తే మాత్రం అక్కడి పోలీసులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా, రిషికేశ్ లో గంగానది ఒడ్డున షికార్లు చేస్తున్న 10 మంది విదేశీయులు పోలీసుల కంటబడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా యథేచ్ఛగా విహరిస్తున్న వారిని పోలీసులు నిలువరించి, వారితో 500 సార్లు 'సారీ' అని రాయించారు. ఆ విదేశీయుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇజ్రాయెల్ దేశాలకు చెందినవారున్నారు. పోలీసులు ప్రశ్నించగా, సరైన కారణాలు చెప్పలేకపోవడంతో... "నేను లాక్ డౌన్ నిబంధన పాటించలేదు.... క్షమించండి" అనే వాక్యాలను కాగితంపై ఐదు వందల సార్లు రాయించారు.
స్థానిక సహాయకులు తోడు లేకుండా విదేశీయులు సంచరిస్తే ఊరుకోబోమని, వారికి బస కల్పిస్తున్న హోటళ్లపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రిషికేశ్ విదేశీయులకు చక్కని పర్యాటక స్థలంగా పేరుగాంచింది. అయితే కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా దౌత్యకార్యాలయాలు తమ వారిని వెంటనే భారత్ నుంచి తరలించాయి. ఇంకా కొందరు విదేశీయులు రిషికేశ్ లోనే ఉన్నట్టు తాజా ఘటన ద్వారా తెలిసింది.